తెలంగాణలో టైల్స్‌ పరిశ్రమ

వెల్‌స్పన్‌ గ్రూప్‌ సంస్థ తెలంగాణలో రూ.1150 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న టైల్స్‌, టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీలో ఆగస్టు నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని సంస్థ ఫ్లోరింగ్‌ సీఈవో ముఖేశ్‌ సావ్‌లానీ బుధవారం ఇక్కడ చెప్పారు. షాద్‌నగర్‌ నుంచి చేవెళ్ల వెళ్లే దారిలోని చందనవెల్లిలో 600 ఎకరాల ప్రాంగణంలో పరిశ్రమ నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయని తెలిపారు. తొలిదశలో 100 ఎకరాల్లో పనులు చేపట్టినట్లు వివరించారు. ఆరంభంలో 10 లక్షల చదరపు మీటర్ల టైల్స్‌ ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమను రెండు నెలల్లో ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. 1500 నుంచి 2000 మందికి ఉపాధి లభిస్తుందని.. ప్రస్తుతం 400 మంది పనిచేస్తున్నట్లు చెప్పారు. క్లిక్‌ అండ్‌ లాక్‌ టెక్నాలజీతో దేశంలోనే తొలిసారి ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. టైల్స్‌ పరిశ్రమలన్నీ ఎక్కువగా గుజరాత్‌లో ఉన్నాయని.. తెలంగాణలో తమదే తొలి టైల్స్‌ పరిశ్రమ అని తెలిపారు. గృహ, ఆతిథ్య, వాణిజ్య, కార్యాలయాల అవసరాలు తీర్చే టైల్స్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. వుడ్‌, మార్బుల్‌ ఫినిష్‌తో పాటూ కార్పెట్‌, కృత్రిమ గడ్డి ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. రూ.30వేల కోట్ల టైల్‌ పరిశ్రమలో హైదరాబాద్‌ వాటా రూ.500 కోట్లు అని సంస్థ బిజినెస్‌ హెడ్‌ అజయ్‌ మెహ్రా అన్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉండటం.. దేశ, విదేశాలకు ఎగుమతికి రవాణా పరంగా హైదరాబాద్‌ అనుకూలంగా ఉండటంతో వ్యూహాత్మకంగా ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేశామని తెలిపారు.