జీఎస్‌టీ వార్షిక రిటర్న్‌ల గడువు

3 నెలల పొడిగింపు
ఇ-వేబిల్లుల చెల్లుబాటు సమయం కూడా

2018-19 ఆర్థిక సంవత్సరానికి జీఎస్‌టీ వార్షిక రిటర్న్‌ల దాఖలు గడువు తేదీని ప్రభుత్వం మూడు నెలలు పొడిగించింది. సెప్టెంబరు 30 వరకు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్‌ను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 24న లేదా ఆ లోపు తీసుకున్న ఇ-వేబిల్లులతో పాటు, మార్చి 20- ఏప్రిల్‌ 15 మధ్య గడువు తీరిన ఇ-వేబిల్లుల వర్తింపు సమయాన్ని కూడా మరోమారు పొడిగిస్తూ సీబీఐసీ నిర్ణయం తీసుకుంది. గత నెలలో పై ఇ-వేబిల్లుల వర్తింపు సమయాన్ని ఏప్రిల్‌ 30 వరకు పొడిగించగా.. ఇవి మే 31 వరకు చెల్లుబాటు అవుతాయని తాజాగా సీబీఐసీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మార్చి 25న లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించినప్పటి నుంచి సరకు రవాణా సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాక్‌డౌన్‌ను మే 17 వరకు కేంద్రం పొడిగించడంతో ఇ-వేబిల్లుల చెల్లుబాటు సమాయాన్ని సీబీఐసీ పొడిగించింది.