చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఆచార్య’. సామాజిక ఇతివృత్తానికి రాజకీయ అంశాల్ని మేళవిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం పాటుపడే వ్యక్తిగా శక్తివంతమైన పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నారు. ఈ నెల 22న చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని ‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అదే రోజు చిత్ర విడుదల తేదీని వెల్లడించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్‌చరణ్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కరోనా వైరస్ ప్రభావంతో మార్చిలో చిత్రబృందం షూటింగ్‌ను నిలిపివేసింది. తిరిగి అక్టోబర్ నుంచి చిత్రీకరణను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
