ఛైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు కూల్‌పాడ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా ఫిషర్ యువాన్ నియమితులయ్యారు. సైయ్యద్ తాజుద్దీన్ స్థానంలో ఫిషర్‌ను ఎంపిక చేసినట్లు శుక్రవారం ఆ కంపెనీ తెలిపింది. 2008లో కూల్‌పాడ్ భారత మార్కెట్లోకి ప్రవేశించిందని, నూతన నియామకం తమ బ్రాండ్‌ను మరింత ముదుకు తీసుకెళ్లడానికి దోహదం చేయనుందని ఆ కంపెనీ అభిప్రాయపడింది. దేశంలో తమ ఉనికిని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. ఇక్కడి మార్కెట్లో పెరగడానికి, తమ ఆర్‌అండ్‌డి అభివృద్ధికి ఫిషర్ ఎత్తుగడల రోడ్‌మ్యాప్‌ను రూపొందించనున్నారని పేర్కొంది. కూల్పాడ్లో ఆయనకు పలు హోదాల్లో పని చేసిన అనుభవం ఉందని తెలిపింది. వచ్చే కొన్నేళ్లలో వినూత్న టెక్నలాజీ, చౌక ధరలతో భారత మార్కెట్లో పాగా వేస్తామని ఫిషర్ పేర్కొన్నారు.
