కాళేశ్వరం ప్రాజెక్టుతో చొప్పదండి మరో కోనసీమగా మారనున్నది

లక్షా 30 వేల ఎకరాలకు సాగు నీరుచొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో చొప్పదండి నియోజకవర్గం మరో కోనసీమగా మారబోతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా గంగాధర మండలం మధురానగర్ వద్ద నారాయణపూర్ కుడికాలువ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2009 లో ఎల్లంపల్లి కుడికాలువ పనులు ప్రారంభించినా అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగలేదన్నారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కుడి, ఎడమ కాలువల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగంగా జరిపిస్తున్నట్లు చెప్పారు.

19 కిలోమీటర్ల కుడికాలువతో పాటు 22 కిలోమీటర్ల ఎడమ కాలువ పనులు పూర్తయితే చొప్పదండి నియోజకవర్గంలో 1.30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైతే చొప్పదండి నియోజకవర్గం పచ్చని పంటలతో సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.