ఐపీఎల్‌ నుంచి వివో తప్పుకుంది!

భారత్‌-చైనా వివాదం నేపథ్యంలో చైనాకు చెందిన యాప్‌లపై భారత్‌ నిషేధం విధించుకుంటూ పోతుంటే, చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ కంపెనీ వివోను ఐపీఎల్‌కు టైటిల్‌ స్పాన్సర్‌గా కొనసాగించడానికి బీసీసీఐ మొగ్గుచూపడంతో ఇప్పటివరకూ తీవ్ర దుమారం రేగింది. అదే సమయంలో బీసీసీఐ వ్యహరిస్తున్న తీరును వేలెత్తి చూపుతూ రాజకీయ విమర్శలు ఊపందుకున్నాయి. ప్రధానంగా సోషల్‌ మీడియాలో విమర్శల జోరు అందుకోవడంతో వాటికి ముగింపు పలకడానికి వివో సిద్ధమైంది. ఈ క్రమంలోనే స్వచ్ఛందంగానే ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది.

అయితే బీసీసీఐ మాత్రం ఇంకా అంగీకరించనట్లే తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరి మధ్య చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఇటీవల భారతదేశం – చైనా సరిహద్దు లలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో వివిధ రంగాల నుండి చైనా వస్తువులను బాయ్ కాట్ చెయ్యాలని పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం చైనా దేశానికి సంబంధించి 59 యాప్లను నిషేధించిన సంగతి కూడా విదితమే. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్‌ స్పాన్సర్ గా కొనసాగడం మంచిది కాదని భావించిన వివో సంస్థ స్వచ్ఛందంగా స్పాన్సర్ షిప్ నుండి విరమించుకోవడానికి సన్నద్ధమైంది.

అయితే కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే తప్పుకునే విధంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ షిప్ సంబంధించి వివో హక్కులను ఐదు సంవత్సరాల కాలంలో ఏకంగా రూ. 2199 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వివో ప్రతి సంవత్సరం జరిగే లీగ్ లో రూ. 440 కోట్లు చెల్లించేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే తాజాగా జరిగిన ఐపిఎల్ సమావేశంలో చర్చల తర్వాత వివో కంపెనీని ఐపీఎల్ స్పాన్సర్ గా కొనసాగుతుందని బీసీసీఐ తెలిపిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో బీసీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఐపీఎల్ ను బహిష్కరించాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరన్ మంచ్ పిలుపు ఇచ్చింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వివో సంస్థ స్పాన్సర్ షిప్ తప్పుకోవడమే మంచిదని నిర్ణయించింది. అది కూడా ఈ ఏడాది సీజన్‌ ఐపీఎల్‌కు దూరంగా ఉండబోతున్నట్లు బీసీసీఐకి తెలిపింది. దీనిపై బీసీసీఐ-వివోల మధ్య చర్చలు నడుస్తున్నాయి.