True Journalism, No misleading titles, No cooked up stories and cheap analyses?….. 

Contact Us : [email protected], Call : 9849851841 

ఏమో రైలు ఎగరావచ్చు..!

రైలు ఎగరడమేంటి..? జేమ్స్‌ బాండ్‌ సినిమాలో చూసినట్లు ఓ విమానం ల్యాండ్‌ అయిన వెంటనే దాని రెక్కలు ముడుచుకుపోయి, అది రైలులా మారిపోయి పట్టాలపై వెళ్తూ పాసింజర్లను వారి గమ్యస్థానాల్లో దింపుతుందనుకుంటున్నారా? ఇలాంటి ఊహకందని దృశ్యాలను భవిష్యత్‌లో మనం కూడా చూడవచ్చని అంటున్నారు అక్కా టెక్నాలజీస్‌ సంస్థ సీఈవో మారిస్‌ రిక్కీ. ప్రపంచ వ్యాప్తంగా ఇంజనీర్ల ప్రతిభను పారిశ్రామిక వర్గాలతో అనుసంధానం చేసి అద్భుతాలు సృష్టిస్తోన్న ఈ ఫ్రెంచ్‌ సంస్థ వ్యవస్థాపకుడు సరికొత్త ఎయిర్‌ క్రాఫ్ట్‌ డిజైన్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కా టెక్నాలజీ నూతన ఆవిష్కరణలకు పేరుగాంచిన సంస్థ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంజనీర్లను తాత్కాలికంగా ఉద్యోగులుగా తీసుకుని అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తోంది. డ్రైవర్‌ అవసరంలేని స్వయం చోదక కారు ఆలోచనను అభివృద్ధి చేసింది కూడా ఈ సంస్థే.
‘లింక్‌ అండ్‌ ఫ్లై’ అనేది ఈ సంస్థకు చెందిన సరికొత్త ఎయిర్‌ క్రాఫ్ట్‌ డిజైన్‌ పేరు. పారిస్‌లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో అక్కా సంస్థ సీఈవో మారిస్‌ రిక్కీ మాట్లాడారు. ‘డ్రైవర్‌ లేకుండా స్వతంత్రంగా నడిచే ఎలక్ట్రిక్‌ కార్లొచ్చేశాయి. ఇక విమానాల సంగతే చూడాలి’ అని అన్నారు. బోయింగ్‌ విమాన సంస్థతో కలిసి పనిచేయడమే లక్ష్యంగా అక్కా సంస్థ పనిచేస్తోంది. బోయింగ్‌ ప్రపంచ వ్యాప్తంగా విమాన తయారీలో అగ్రస్థానంలో ఉంది. ఈ సంప్రదాయాన్ని తన సరికొత్త డిజైన్‌తో సమూలంగా మార్చేయాలని అక్కా భావిస్తోంది.