ఏప్రిల్‌లో 46% తగ్గిన ఇంధన వినియోగం

ఏప్రిల్‌లో దేశీయ ఇంధన వినియోగం దాదాపు 46 శాతం తగ్గింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక కార్యకలాపాలు, ప్రయాణాలు నిలిచిపోవడంతో వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) మినహా పెట్రోలియం ఉత్పత్తులకు గిరాకీ భారీగా పడిపోయింది.  అయితే ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో ఏప్రిల్‌ నెల చివరి పది రోజుల్లో మాత్రం గిరాకీ స్వల్పంగా పెరిగింది. ఇక ఎక్కువ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ ఆరంభమవుతున్నందున, మే ద్వితీయార్థంలో పెట్రో వినియోగం మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. పెట్రోలియం శాఖ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌లో భారత ఇంధన వినియోగం 45.8 శాతం తగ్గి 9.929 మిలియన్‌ టన్నులుగా నమోదైంది. 2019 ఇదే నెలలో దేశంలో ఇంధన వినియోగం 18.32 మిలియన్‌ టన్నులుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో ఇంధన వినియోగం 16.08 మిలియన్‌ టన్నులుగా నమోదైంది. ఏప్రిల్‌లో పెట్రోల్‌ విక్రయాలు 60.43 శాతం క్షీణించి 9,73,000 టన్నులుగా, డీజిల్‌ వినియోగం 55.6 శాతం తగ్గి 3.25 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) వినియోగం 91.3 శాతం పతనమై 56,000 టన్నులకు పరిమితమైంది. ఇక ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగం 12.2 శాతం పెరిగి 2.13 మి.టన్నులకు చేరింది.