True Journalism, No misleading titles, No cooked up stories and cheap analyses?….. 

Contact Us : [email protected], Call : 9849851841 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి – ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన దిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై నివేదిక సమర్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందుంచారు. రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక హోదా ఆవశ్యకతను ఈ కీలక భేటీలో విన్పించారు. అలాగే, అధికారులందరికీ ఎనిమిది పేజీల లేఖను అందజేశారు. దాంతో పాటు 48 పేజీల నివేదికను కూడా నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొన్న సభ్యులందరికీ జగన్‌ అందజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీలో నెలకొన్న పరిస్థితులను జగన్‌ వివరిస్తూ.. ‘‘2015- 20 మధ్య ఏపీ రెవెన్యూ లోటును 14వ ఆర్థిక సంఘం రూ.22,113 కోట్లుగా అంచనా వేసింది. గత ఐదేళ్లలో తెలంగాణకు రూ.లక్షా 18వేల కోట్ల రెవెన్యూ మిగులు ఉంది. వాస్తవానికి గత ఐదేళ్లలో ఏపీ రెవెన్యూ లోటు 66,362 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. 2015-16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.14,414  కాగా.. ఏపీలో  రూ.8,397 మాత్రమే. రాష్ట్ర విభజన సమయంలో హోదా ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. హోదా లభిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు, మౌలిక వసతులు సమకూరుతాయి. హైదరాబాద్‌ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన నగరం. రాష్ట్ర విభజన నాటికి ఏపీకి రూ.97 వేల కోట్లు అప్పులు ఉన్నాయి. 2018 -19 నాటికి ఏపీ అప్పులు రూ.2లక్షల 58వేల కోట్లకు చేరాయి. ఏడాదికి రూ.20వేల కోట్ల వడ్డీ, రూ.20వేల కోట్ల అసలు చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ లేదు. చేతివృత్తులు, ఉపాధి అవకాశాలు భారీగా తగ్గిపోయాయి. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక యువత వలస వెళ్తోంది. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని ప్రత్యేక హోదా ఇవ్వండి. హోదా ఇస్తే రాష్ట్రం నిలదొక్కుకుంటుంది’’ అని అన్నారు.