ఏటీఎంలు ఖాళీగా ఉంచితే జరిమానానే!

ఏటీఎంలు నగదు లేకుండా ఖాళీగా ఉంటే బ్యాంకులపై భారీగా జరిమానా విధించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) సిద్ధమవుతోంది. నగదు కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు గాను ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నగదు లేకుండా ఏటీఎంలను మూడు గంటల పాటు ఖాళీగా ఉంచితే బ్యాంకులపై ఈ జరిమానా విధించాలని ఆర్‌బీఐ భావిస్తోంది. అంతేకాకుండా ప్రాంతాల వారీగా ఈ జరిమానాను విధించాలని యోచిస్తోంది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఏం కేంద్రాలు గత కొద్ది రోజులుగా గంటల కొద్దీ ఖాళీగా దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో నగదు కోసం వినియోగదారులు.. బ్యాంకుల్లో బారులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఏటీఎంలలో ఎంత మొత్తం నగదు ఉందనేది బ్యాంకులకు తెలిసే విధంగా సెన్సార్లున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఏటీఎంల్లో నగదు నింపటంలో బ్యాంకులు అంతగా ఆసక్తి చూపించటం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకు ఖాతాదారులు.. బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల వద్దకు వెళ్లి నగదు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటోంది. అంతేకాకుండా వీరి వద్ద నుంచి నగదు తీసుకున్నందుకు చార్జీలను చెల్లించాల్సి వస్తోంది.