ఇప్పుడు డ్రోన్ ల ద్వార ఫుడ్ డెలివరీ – జోమాటోలో

ఆన్‌లైన్‌లో మరియు యాప్ ద్వార ఆహార పదార్థాలు అందించే జొమాటో..డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఆహార పదార్థాలను సరఫరా చేయడానికి సిద్ధమైంది. ఇందుకోసం తొలిసారిగా నిర్వహించిన పరీక్ష విజయవంతమైనట్లు కంపెనీ పేర్కొంది. ఈ సేవలు అందించడానికి గత డిసెంబర్‌లో లక్నోకు చెందిన ప్రముఖ స్టార్టప్ టెక్‌ఈగల్ ఇన్నోవేషన్‌ను కొనుగోలు చేసింది. ఆర్థిక వివరాలు మాత్రం సంస్థ వెల్లడించలేదు. హైబ్రిడ్ డ్రోన్ల సహాయంతో ఐదు కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న వినియోగదారుడికి 10 నిమిషాల్లో ఆహార పదార్థాలను అందించనున్నట్లు కంపెనీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ డ్రోన్ ఐదు కిలోల బరువును అవలీలగా తీసుకుపోనున్నది. పౌర విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ పరిధిలోని ఒక నియంత్రణ ప్రాంతంలో ఈ పరీక్షను నిర్వహించింది. రోడ్డు మార్గం కన్నా ఆకాశ మార్గాన ఆహార పదార్థాలను మరింత వేగవంతంగా డెలివరీ చేయాలనే ఉద్దేశంతో ఈ నూతన సర్వీసులకు శ్రీకారం చుట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. దీనికి టెక్నాలజీ అంత సిద్ధంగా ఉన్నప్పటికీ నియంత్రణ మండళ్లు అనుమతించాల్సి ఉంటుందన్నారు. డ్రోన్లలో నిక్షిప్తం చేసిన సెన్సార్‌కు కంప్యూటర్ సెన్సార్‌తో అనుసంధానం చేయడం ద్వారా డెలివరీ చేసే ప్రాంతాన్ని ముందుగా గుర్తించి అందించడం జరుగుతుందన్నారు.