కరోనా వైరస్ పేరు వినగానే అందరూ హడలిపోతున్నారు. అలాంటిది కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తి.. జన సమూహంలోకి వస్తే పరిస్థితి ఏంటి? అందరూ అప్రమత్తం కావాల్సిందే. కరోనా క్వారంటైన్ ముద్ర కలిగి ఉన్న ఓ వ్యక్తిని ఆలేరు రైల్వే స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా డోర్నకల్ డివిజన్ రాముల తండా ఎన్నారం గ్రామానికి చెందిన భూక్యా రమేశ్.. అమెరికాలోని డల్లాస్ నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రమేశ్ ఇవాళ ఉదయమే అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అక్కడ్నుంచి ఓ క్యాబ్‌లో సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అనంతరం సొంత గ్రామానికి వెళ్లేందుకు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరాడు. అయితే ఆలేరు పట్టణానికి రాగానే రమేశ్ చేతిపై ఉన్న హోం క్వారంటైన్ ముద్రను టికెట్ కలెక్టర్ గుర్తించాడు. దీంతో అప్రమత్తమై టికెట్ కలెక్టర్ పోలీసులకు, వైద్య అధికారులకు సమాచారం అందించాడు. రైల్వేస్టేషన్‌కు చేరుకున్న పోలీసులు, అధికారులు రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 108 అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు రమేశ్‌కు గాంధీ వైద్యులు నిర్వహించనున్నారు.