ఆదివారం దాయాదుల పోరు

ప్రపంచకప్‌లో అసలు సిసలైన పోరుకు సమయం దగ్గరపడింది. ఆదివారమే చిరకాల ప్రత్యర్థులు భారత్‌ X పాక్‌ మెగా టోర్నీలో తలపడనున్నాయి. టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుండగా ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాకిస్థాన్‌ కాస్త కంగారుగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌పై విజయం తప్పిస్తే పాక్‌ మిగతా మ్యాచ్‌ల్లో అంతగా ప్రభావం చూపలేకపోయింది. మరోవైపు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలను ఓడించిన భారత్‌ సమతూకంతో కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ భావోద్వేగాల కలబోత దాయాదుల సమరంతో ఈ వారంతం క్రికెట్‌ అభిమానులకు పసందైన వీనుల విందు అందించనుంది. రెండు జట్ల మధ్య బలాబలాలు చూస్తే ఈసారీ భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత జట్టులో బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు మిడిల్‌ ఆర్డర్‌లో ధోనీ, హార్దిక్‌ పాండ్య మంచి ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు పాకిస్థాన్‌ జట్టు పైకి ఎలా ఉన్నా తనదైన రోజు ఏ జట్టునైనా ఓడించగల సత్తాగలది. ప్రస్తుత సిరీస్‌లో ఇప్పటివరకూ పాక్‌ బ్యాట్స్‌మెన్‌ పెద్దగా ఆకట్టుకోకపోయినా బౌలర్లు మాత్రం ఫర్వాలేదనిపిస్తున్నారు. అందుకే ఆదివారం జరగబోయే మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.