అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తలసాని దంపతులు

ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల వేడుక ఘనంగా జరుగుతోంది. భక్తులతో అమ్మవారి ఆలయం పోటెత్తింది. ఆదివారం వేకువజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. మంత్రి తలసాని యాదవ్ దంపతులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఈ ఉదయం 11 గంటలకు అమ్మవారిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తుల భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ ఈ ఉదయం 9 గంటలకు ఆదయ్యనగర్ నుంచి ఎంపీ కవిత బంగారు బోనాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారని అన్నారు. గతంలో కంటే బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. మహంకాళి అమ్మవారి దయతో వర్షాలు కురిసి.. రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరినట్లు తలసాని పేర్కొన్నారు.
కాగా అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 వేల మంది పోలీసులతో భారీ భద్రత కల్పించారు. సీసీ కెమెరాలతో నిఘా.. లష్కర్‌ బోనాలతో ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా సికింద్రాబాద్ పరిధిలో రేపు ఉదయం వరకు మద్యం షాపులు మూసివేయించారు.