True Journalism, No misleading titles, No cooked up stories and cheap analyses?….. 

Contact Us : [email protected], Call : 9849851841 

అత్తింటి ఎదుట ఆందోళన చేపట్టిన స్వాతి

పది నెలల క్రితం జరిగిన తన ప్రేమ వివాహం నరకం చూపిందంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. అత్తింటి వారు చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ అత్తింటి ఎదుట ఆందోళన చేపట్టిన బాధితురాలి వివరాలిలా ఉన్నాయి..హైదరాబాద్‌ నాచారం ప్రాంతానికి చెందిన స్వాతి డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థిని. తమ ప్రాంతంలో విద్యుత్తు మీటరు రీడింగు తీసే, ఖమ్మం నగరంలోని పాండురంగాపురానికి చెందిన బాలాజీని ఆమె ప్రేమించింది. 2017, అక్టోబరు 9న ఆర్యసమాజంలో పెద్దలు, పోలీసుల సమక్షంలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. నవదంపతులు అయిదు నెలల పాటు పాండురంగాపురంలో కాపురం పెట్టారు. ఆ సమయంలో తన అత్త పలుమార్లు కొట్టడంతో పాటు రెండుసార్లు గర్భవిచ్ఛిత్తి చేయించారని స్వాతి ఆరోపించింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా సర్దిచెప్పారని, అప్పట్నుంచి మూడు నెలలుగా భర్తతో కలసి హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో ఉంటున్నట్లు తెలిపింది. తన భర్తకు మరో వివాహం చేయాలనే ఉద్దేశంతో విడాకులివ్వాలని అత్తింటి వారు ఒత్తిడి తెస్తున్నారని, దీంతో జూన్‌ 23న ఆత్మహత్నా ప్రయత్నం చేసినట్లు వాపోయింది. తన మరిది కోరికను కూడా తీర్చాలని దూషించినట్లు ఆరోపించింది. తీవ్ర అనారోగ్యానికి గురైన తాను కోలుకోగానే ఆదివారం రాత్రి పాండురంగాపురంలోని అత్తింటికి వచ్చానంది. దీంతో అత్తింటివారు మరోసారి తనను కొట్టి, ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారని ఆరోపించింది. రాత్రి నుంచి ఆరుబయటే ఉన్నానని గేటు ముందు నిరసనకు దిగిన స్వాతి విలేకరులకు తెలిపింది. పలు మహిళా సంఘాల ప్రతినిధులు బాధితురాలికి సంఘీభావం తెలిపారు. న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తామన్నారు. సమాచారం అందుకున్న ఖానాపురంహవేలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. బాధితురాలి ఫిర్యాదుతో భర్తను, అత్తింటి వారిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నామని సీఐ నాగేంద్రాచారి తెలిపారు. ఇప్పటికే నాచారం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనట్లు చెప్పారు.