అందానికి అందమై గిరులెల్ల హిమమై

www.eenadu.net/vsp-sty2a.jpgప్రకృతి అందాలకు మన్యం పెట్టింది పేరు. కనువిందు చేసే కొండలపై వర్షం కురిస్తే ఎంతో బాగుంటుంది. ఇదే సమయంలో పొగమంచు ఘాట్‌ రోడ్డుపై కమ్ముకోవడం మరింత ఆహ్లాదం కలిగిస్తుంది. అటువంటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు ఎంతో ఇష్టపడతారు. పాడేరు ఘాట్‌ మార్గం నుంచి నింగిలో ఆదివారం కనిపించిన మేఘాలు మరింత వన్నెతెచ్చాయి. అమ్మవారి పాదాలు దాటిన తర్వాత నుంచి వంట్లమామిడి వెళ్లే వరకు దట్టంగా కురిసిన పొగమంచు అదరహో అనిపించింది. వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండల పైనుంచి వర్షపు నీరు పొంగి ప్రవహిస్తోంది. రాజాపురం వద్ద రోడ్డు సమీపంలో వంక చింత జలపాతం ఉరకలేస్తుంది. పచ్చనిచెట్లు, రాళ్ల మధ్య నుంచి నీరు ప్రవహిస్తూ ఆకట్టుకుంటోంది. పాడేరు ఘాట్‌లో పగలు దట్టంగా మంచు అలముకుంటుంది. వర్షం తగ్గినప్పుడు కొండలపై మేఘాలు విహరిస్తున్నాయి.
గొందిపాకలు పంచాయతీ ఎర్నాపల్లి సమీపంలోని పిట్టఉరుకు జలపాతం పరవళ్లు తొక్కుతోంది. పాలనురగలా కొండపై నుంచి పడుతున్న నీరు పర్యటకుల్ని ఆకట్టుకుంటోంది.
-చింతపల్లి, న్యూస్‌టుడే
కొత్తపల్లి జలపాతం పొంగి పొర్లుతూ పర్యటకుల మనసును దోచుకుంటోంది. మన్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గెడ్డలు, జలపాతాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొత్తపల్లి జలపాతం ఉరకలెత్తుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా జలపాతం అందాలు చూసి మంత్రముగ్ధులవుతున్నారు.
– న్యూస్‌టుడే, జి.మాడుగుల
డముకు వ్యూపాయింట్‌ నుంచి అనంతగిరులను సందర్శించే పర్యటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంచు అందాలు అబ్బుర పరుస్తున్నాయి. వ్యూపాయింట్‌ దిగువ భాగమంతా పాల కడలిలా కనిపిస్తుండటంతో పర్యటకులు సెల్ఫీలు దిగుతూ సరదా తీర్చుకుంటున్నారు.
– న్యూస్‌టుడే, అనంతగిరి, అనంతగిరి గ్రామీణం