ముఖ్య అతిథిగా మోహన్లాల్ వద్దు!

కేరళ: మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వస్తుందంటే కేరళలో పండగ వాతావరణ నెలకొంటుంది. అలాంటి వ్యక్తి ఏదైనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తుంటే ఎవరైనా అడ్డు చెబుతారా? కానీ, మలయాళ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(ఏఎంఎంఏ-అమ్మ) అధ్యక్షుడైన మోహన్‌లాల్‌కు మాత్రం ఈ విషయంలో చుక్కెదురైంది. ఇందుకు కారణం ఇటీవల ఆయన తీసుకున్న ఓ నిర్ణయమే.
ఒక నటి విషయంలో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఎదుర్కొని, జైలు పాలైన నటుడు దిలీప్‌ను మళ్లీ చిత్ర పరిశ్రమలోకి ఆహ్వానించడమే కాకుండా, ఆయన సభ్యత్వాన్ని మోహన్‌లాల్‌ పునరుద్ధరించారు. ఈ విషయంలో ఆయన అమ్మకు చెందిన ఇతర సభ్యులనెవరినీ కనీసం సంప్రదించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న అవార్డు ప్రదానోత్సవానికి మోహన్‌లాల్‌ను ఆహ్వానించవద్దంటూ జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు బిజూకుమార్‌ దామోదరన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
‘చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి కేరళ ప్రభుత్వ ఏటా అవార్డులను ప్రదానం చేస్తుంది. ఇవి ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. ఈ కార్యక్రమం సజావుగా, అనువైన వాతావరణంలో సాగాలి’ అని ఫేస్‌బుక్‌ వేదికగా బిజు పేర్కొన్నారు. ఒక నటుడిని(మోహన్‌లాల్‌) పిలిచి అవార్డు గ్రహీతలను అవమానించవద్దు. రాష్ట్ర సాంస్కృతిశాఖ మంత్రి ఆధ్వర్యంలో సీఎం ఆ అవార్డులను ప్రదానం చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఇదే విషయంపై 100కు పైగా నటులు తమ మద్దతు తెలుపుతున్నారని వారి జాబితాను సైతం బిజు పంచుకున్నారు. వీరిలో నటుడు ప్రకాష్‌రాజ్‌, మాధవన్‌, సచ్చిదానందన్‌, శంకర్‌ పిళ్లై, రాజీవ్‌ రవి, బిన పాల్‌, రిమా కలింగల్‌, గీతూ మోహన్‌దాస్‌ శృతి హరిహరన్‌ తదితరుల సంతకాలతో కూడిన పిటిషన్‌ను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సమర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని నటుడు మోహన్‌లాల్‌ను రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి ఏకే బాలన్‌ ఆహ్వానించారు. దీంతో చిత్ర పరిశ్రమలో ఈ విషయం చర్చనీయాంశమైంది. ‘తాజాగా సినిమా ఇండస్ట్రీలో మహిళలకు వ్యతిరేకంగా చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి రాష్ట్ర మంత్రివర్యులకు తెలియవనుకుంటా’ అంటూ బిజు విమర్శించారు.
ఈ ఏడాది జూన్‌లో అమ్మ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మోహన్‌లాల్‌ ఓ నటిని అపహరించిన కేసులో నిందితుడిగా ఉన్న నటుడు దిలీప్‌కు అండగా నిలవడమే కాకుండా, చిత్ర పరిశ్రమలో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. దీంతో ఈ వివాదం చెలరేగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *