ఆ రెండు ప్రాంతాలలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ!

గోదావరికి అంతకంతకూ వరద ఉధృతి పెరుగురతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుత ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 19 లక్షల 21 వేల క్యూసెక్కులు గా ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 17.50 అడుగులకు చేరుకుంది. దీంతో పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 68 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 6వేల మందిని తరలించారు. దేవీపట్నం, వీరవరం, తొయ్యేరు గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలకు సహకరించాలని గ్రామస్తులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయికి..
అదేవిధంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అక్కడ కూడా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 2014 తర్వాత మళ్లీ ఆరేళ్లకు అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. భద్రాచలం వద్ద ఇప్పటికే నీటి మట్టం 61.5 అడుగులకు చేరుకుంది. మరో అడుగు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మండలంలోని రేపాకగొమ్ము, రుద్రమ్మకోట, టేకురు, వసంతవాడ, టుకురు గొమ్ము, కోయిదా, నార్లవరం, తిర్లాపురం, చీరవల్లి, చిగురుమామిడిగూడెం సహా మొత్తం14 గ్రామాలు ముంపునకు గురికానున్నాయని అధికారులు తెలిపారు. ఈ గ్రామ ప్రజలను ఖాళీ చేయించి లాంచీలలో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వారి కోసం నిత్యావసరాలు, పాలు, కిరోసిన్, కూరగాయలతో సహా అధికారులు సర్వం సిద్ధం చేశారు. కోవిడ్-19 కారణంగా వైద్య శాఖ అప్రమత్తమైంది. ఎమ్మెల్యే బాలరాజు, కలెక్టర్‌ ఎంవీ రెడ్డి దగ్గరుండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *